బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్య, మత మార్పిడి నిరోధక బిల్లులో భాగమేనని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా ఈ బిల్లు తెచ్చారన్న సిద్ధ రామయ్య వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ బిల్లులో దాచడానికి ఏమీ లేదన్నారు. సిద్ధ రామయ్య స్వయంగా ఈ బిల్లును ముద్రించి ముసాయిదాపై సంతకం చేశారని గుర్తు చేశారు. దీంతో ఈ బిల్లులో ఆయన కూడా భాగమేనని అన్నారు. సిద్ధ రామయ్య 2016లోనే ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఆమోదించారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పేదలు వంటి బలహీన వర్గాలు ప్రలోభాల ద్వారా దోపిడీకి గురవుతున్నారని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. తాము దానిని ఆపాలనుకుంటున్నామని చెప్పారు. ఈ బిల్లు చట్టబద్ధమేనని, అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో గురువారం ఆమోదించిన ‘మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు 2021’కు తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.