బెంగళూరు, మార్చి 15: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మరో చార్జీల భారాన్ని మోపింది. ఒక వైపు ఐదు గ్యారెంటీలు ఇస్తున్నామంటున్న సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం.. ఆర్టీసీ, మెట్రో, పాలు, మద్యం, ఆస్తి రిజిస్ట్రేషన్, వాహనాల రిజిస్ట్రేషన్, దవాఖాన సర్వీసు చార్జీలు, ఈవీ వాహనాల పన్ను, విద్యుత్తు చార్జీలు, ఆస్తి పన్నును ఇప్పటికే గణనీయంగా పెంచింది. ఇప్పుడు ధరలు పెరగడం నీటి చార్జీల వంతు. నీటి బిల్లులను నెలకు రూ.500 వరకు పెంచుతున్నట్టు బెంగళూరు వాటర్ సప్లయి అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్బీ) ప్రకటించింది. తొలుత ప్రకటించిన దానికన్నా ఇది చాలా తక్కువని, పైగా 2014 నుంచి నీటి చార్జీలను పెంచలేదంటూ ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకుంది.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం ఈ చార్జీల పెంపును వెల్లడించారు. లీటర్కు 7 నుంచి 8 పైసలు పెంచుతామంటూ ప్రచారం జరిగిందని, కానీ తాము కేవలం ఒక్క పైసాను మాత్రమే పెంచామని ఆయన చెప్పారు. బీబీఎంపీ బడ్జెట్ త్వరలోనే ఉందని, ఈ క్రమంలో బెంగళూరు ఎంఎల్ఏలతో చర్చించి సవరించిన చార్జీలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నీటి చార్జీల పెంపు కారణంగా ప్రతి ఇంటికి 400 నుంచి 500 రూపాయలు అదనంగా బిల్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.
నిర్వహణా ఖర్చులు పెరిగిపోవడం, బోర్డుపై ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి చార్జీలు పెంచక తప్పలేదని శివకుమార్ తెలిపారు. ముఖ్యంగా పెరిగిన విద్యుత్తు చార్జీల వల్ల బోర్డుపై భారం ఎక్కువ పడుతున్నదని, బోర్డు ఇప్పటికే ఏడాదికి వెయ్యి కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్నదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కౌన్సిల్లో కొందరు సభ్యుల ఆందోళనను ఆయన ప్రస్తావిస్తూ బెంగళూరులోని చాలామంది అపార్ట్మెంట్ బిల్డర్లు నీటి పన్నును నివాసితుల నుంచి వసూలు చేస్తున్నా బోర్డుకు కట్టడం లేదని చెప్పారు. మరికొందరు అక్రమ కనెక్షన్లతో నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నగరానికి ఎలాంటి ఆటంకం లేకుండా నీటి సరఫరాకు, అప్పుల భారం నుంచి బయటపడటానికి నీటి చార్జీలు పెంచక తప్పలేదని శివకుమార్ స్పష్టం చేశారు.