నమస్తే తెలంగాణ (ముంబై), అక్టోబర్ 24: బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. తనపై ఓ ఎస్ఐ ఐదు నెలల్లో నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించిన ఆమె గురువారం రాత్రి సతారా జిల్లా దవాఖానలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్ఐ నిత్యం పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన చేతిపై రాసిన సూసైడ్ నోట్లో ఆమె పేర్కొన్నారు. మరో పోలీసు అధికారి ప్రశాంత్ బంకర్ కూడా తనను మానసికంగా వేధించినట్లు ఆమె తన నోట్లో ఆరోపించారు. కాగా, బద్నేని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫల్తాన్ ఉప-జిల్లా దవాఖానలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బాధితురాలు ఫల్తాన్ జిల్లా డీఎస్పీకి జూన్ 19న రాసిన మరో లేఖలో ఇటువంటి ఆరోపణలే చేశారు.
ఆమె తన లేఖలో ఎస్పీ బద్నీ, సబ్ డివిజనల్ పోలీసు ఇన్స్పెక్టర్ పాటిల్, పోలీసు ఇన్స్పెక్టర్ లాడ్‌పుత్రే పేర్లను ప్రస్తావించారు. ఈ ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో రాజకీయ వివాదాన్ని సృష్టించింది. మహాయుతి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకుడు నామ్‌దేవ్‌రావు వడేట్టివార్ తీవ్రంగా విమర్శించారు. మహిళలను కాపాడాల్సిన పోలీసు అధికారి ఓ డాక్టర్‌పై లైంగి క దాడికి పాల్పడితే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏదని ప్రశ్నించారు. డాక్టర్ ముందుగానే ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
ఆ లేఖపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఆ పోలీసు అధికారులను ఎవరు కాపాడుతున్నారు అన్న అంశాలపై దర్యాప్తు జరగాలని ఆయన డిమాండు చేశారు. అయితే మహాయుతిలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ మాత్రం డాక్టర్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చింది. తప్పుడు మెడికల్ రిపోర్టులు రాయాలంటూ బాధిత డాక్టర్‌పై పోలీసులు ఒత్తిడి తెచ్చేవారని ఆమె బంధువు ఒకరు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఆమె ఆఫీసర్‌గా జిల్లా దవాఖానలో చేరారని, తప్పుడు అటాప్సీ నివేదికలు లేదా ఫిట్నెస్ నివేదికలు తయారుచేయాలని ఆమెపైన పోలీసులు ఒత్తిడి తెచ్చేవారని తెలిపారు.