బెంగళూర్ : లవ్ జిహాద్‌కు దీటుగా బదులిచ్చేందుకు హిందూ యువకులు ముస్లిం యువతులకు వల వేయాలని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ పిలుపు ఇచ్చారు. ఇలా చేసినవారికి తాము భద్రత, ఉపాధి కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కర్నాటకలోని బాగల్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రమోద్ ముతాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి పరిస్ధితి ఏంటో తమకు తెలుసునని, ఇక్కడున్న యువతకు తాను ఒకటే పిలుపు ఇస్తున్నానని..మనం ఓ హిందూ యువతిని కోల్పోతే మనం పది మంది ముస్లిం యువతులకు గాలం వేయాలని మీరు అలా చేస్తే మీకు భద్రత కల్పించడంతో పాటు ఉపాధి వంటి అన్ని రకాలుగా వెన్నంటి ఉంటామని ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన బాలికలను లవ్ జిహాద్ పేరుతో వంచిస్తున్నారని, ప్రేమ పేరుతో దేశవ్యాప్తంగా వేలాది మంది బాలికలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై 109 కేసులు నమోదయ్యాయని, వీటిలో అధిక శాతం బీజేపీ ప్రభుత్వ హయాంలోనే నమోదయ్యాయని గత వారం ముతాలిక్ చెప్పారు.
హిందుత్వపై తన వైఖరికి పార్టీ నుంచే అడ్డంకులు ఎదురువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా హిందుత్వ కోసం శ్రీరామ్ సేన పోరాడుతుందని పేర్కొన్నారు. కాగా ఉడిపి జిల్లాలోని కర్కల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముతాలిక్ సన్నద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వి. సునీల్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్కల ఎమ్మెల్యే సునీల్ కుమార్ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయాని ముతాలిక్ విమర్శలు గుప్పించారు.