Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వీడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలను బయటకు వెళ్లనివ్వకూడదని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీ విద్యార్థిని భద్రతను నిర్ధారించడంపై ప్రైవేట్ మెడికల్ కాలేజీ బాధ్యత అని.. ఇందులోకి ప్రభుత్వాన్ని లాగడం అన్యాయమన్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఆడపిల్లను బయటకు రావడానికి అనుమతించకూడదని.. వారు కూడా తమను తాము రక్షించుకోవాలన్నారు. గ్యాంగ్‌రేప్ ఘటనను ‘షాకింగ్’ అని పేర్కొన్నారు. ఇది ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన.. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని.. పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారని.. ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. దాదాపు ఒక నెల కిందట ఒడిశాలోని పూరి బీచ్‌లో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటనను ప్రస్తావించారు. ఒడిశా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటోంది? ఆమె ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. అక్టోబర్ 10న పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్‌లో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. విద్యార్థిని మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అదే కళాశాలకు చెందిన ఒక విద్యార్థి తన స్నేహితులతో కలిసి విద్యార్థినిని నిర్జన ప్రదేశానికి రప్పించి.. ఆ తర్వాత ఫోన్, డబ్బులు లాక్కోవడంతోపాటు లైంగిక దాడికి పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థిని తన కుమార్తెకు బెంగాల్లో భద్రత లేదని, తిరిగి ఇంటికి తీసుకువెళ్తామని.. ఆమెను ఇక్కడ ఏ క్షణంలోనైనా చంపే ప్రమాదం ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురిని తిరిగి ఒడిశాకు తీసుకెళ్తామని.. తమకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. ఆమె బెంగాల్లో ఉండడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని.. ఆమె ఒడిశాలో తన చదువును కొనసాగిస్తుందని బాధితురాలి తండ్రి మీడియాకు తెలిపారు. ఒడిశా నుంచి దుర్గాపూర్‌కు చేరుకున్న మహిళ తల్లిదండ్రులు న్యూ టౌన్షిప్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కూతురు ఆరోగ్యం ఏమాత్రం బాగా లేదని.. నడవనలేని పరిస్థితుల్లో ఉందని వాపోయారు. లైంగిక దాడి వ్యవహారంలో పోలీసులు ఎస్కే రిజాయ్ ఉద్దీన్, ఎస్కే ఫిర్దౌష్, అప్పు అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ టవర్ డంపింగ్ పద్ధతిలో ముగ్గురు నిందితులను గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరి హస్తం ఉందని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. బాధితురాలు ఫ్రెండ్ పాత్రపై సైతం పోలీసులు విచారించనున్నారు. గతేడాది ఆర్జీ ఖర్ ఆసుపత్రిలో జరిగిన ఘటన మరువక ముందో మరోసారి వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి జరుగడంపై బీజేపీ నాయకురాలు సుకాంత మంజుందార్ తీవ్రంగా విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతల పూర్తి పతనానికి ముఖ్యమంత్రిదే బాధ్యత అని.. ఈ విషయంలో ఆమె తప్పించుకోలేరన్నారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి ప్రైవేటు వైద్య కళాశాలపై నిందలు మోపుతుందని విమర్శించారు.