శుక్రవారం 05 జూన్ 2020
National - Feb 01, 2020 , 02:44:20

ఆర్థికం పై నిర్మాణాత్మక చర్చ జరుగాలి

ఆర్థికం పై నిర్మాణాత్మక చర్చ జరుగాలి
  • ప్రపంచ ఆర్థిక పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ఫలప్రదంగా జరుగాలని, ప్రధానంగా ఆర్థిక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరుగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్థిక అంశాలే ప్రధానాంశంగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలోనూ ఆర్థిక అంశాలపై విస్తృతంగా, ఫలప్రదంగా చర్చ జరుగాలి అని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నుంచి భారత్ ఏ విధంగా లబ్ధిపొందగలదన్న దానిపై దృష్టి సారించి చర్చ జరుగాలని సూచించారు. మన ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తృతపరుచడమే తమ లక్ష్యమని చెప్పారు. సమాజంలో మహిళలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. 

సీఏఏపై ఆత్మరక్షణ ధోరణి వద్దు

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రూపొందించడంలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని, ఈ చట్టంలో ఎలాంటి లోపాలు లేవని, అలాంటప్పుడు మనం ప్రతిపక్షాల ఆరోపణలను చూసి ఆత్మరక్షణలో పడాల్సిన అవసరం లేదని ఎన్డీయే కూటమి నేతలతో ప్రధాని మోదీ చెప్పారు. కాబట్టి ఈ చట్టాన్ని నిలదీస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో నిరసనకు దిగితే మనం సీఏఏను మరింత బలంగా సమర్థిద్దామని సూచించారు. 


logo