న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా చేరారు. (Anil Jha joins AAP) ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఢిల్లీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కైలాష్ గహ్లోట్ ఆప్‌కు రాజీనామా చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. అనిల్ ఝా ఆప్‌లో చేరడాన్ని కేజ్రీవాల్ స్వాగతించారు. ఢిల్లీలోని పూర్వాంచల్ వర్గానికి చెందిన అతిపెద్ద నాయకులలో ఆయన ఒకరని కొనియాడారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన ఆ వర్గం ప్రజలు విద్య, ఉపాధి కోసం ఢిల్లీకి వస్తారని తెలిపారు. అయితే గత కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఆ వర్గం ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. తాను సీఎం అయ్యాక వారి జీవన పరిస్థితులు, కాలనీలను మెరుగుపరచడానికి అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.
కాగా, నార్త్ వెస్ట్ ఢిల్లీలోని కిరారీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ఝా, ఆ పార్టీ విధానాల పట్ల విసుగు చెందినట్లు తెలిపారు. అందుకే బీజేపీని వీడి ఆప్‌లో చేరినట్లు చెప్పారు. ఢిల్లీలోని పూర్వాంచల్ సంఘం కోసం పనిచేసిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని ప్రశంసించారు. ఆయన ప్రభుత్వం హయాంలో ప్రతి ఇంటికి తాగునీరు చేరిందని ఝా అన్నారు. ఢిల్లీ బీజేపీలోని కొందరు నేతలను చెడిన కుమారులుగా అభివర్ణించారు. ముసలి తండ్రి మాదిరిగా వ్యవహరిస్తున్న కేంద్ర బీజేపీ వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.