హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి.. అత్యుత్తమ విద్యాప్రమాణాలకు ఒక సూచిక. ఇలాంటి కీలక సూచిలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ వెనుకబడింది. ప్రాథమిక, పాథమికోన్నత స్థాయిల్లో రెండింటిలోనూ జాతీయ సగటు కన్నా దారుణమైన పరిస్థితులు గుజరాత్లో నెలకొన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్లు కొలువైన రాష్ర్టాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో విద్యార్థులకు తగినట్టుగా టీచర్లు అందుబాటులో లేరు. జాతీయంగా ప్రాథమిక స్థాయిలో 26 మంది విద్యార్థులకు ఒక టీచర్ పనిచేస్తుండగా, గుజరాత్లో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ పనిచేస్తున్నారు. ప్రాథమికోన్నతలో జాతీయంగా 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండగా, గుజరాత్లో 32 విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో జాతీయ సగటు 18గా ఉంటే బీజేపీ పాలిత రాష్ర్టాలన్నీ వెనుకబడ్డాయి. ఆయా రాష్ట్రాల్లో విద్యార్థుల నమోదు పెరుగుతున్నా.. ఇందుకనుగుణంగా టీచర్లను నియమించకపోవడంతో అధ్వాన పరిస్థితులు దాపురించాయి.
తెలంగాణ ఉత్తమం
విద్యావసతుల కల్పనలో తెలంగాణ ముందంజలో ఉన్నది. జాతీయ సగటును తలదన్నుతూ తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. అత్యంత కీలకమైన ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిలో తెలంగాణ ఉత్తమంగా ఉన్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో జాతీయ సగటుతో, విద్యాహక్కు చట్టంతో పోల్చినా టీచర్లు అధికంగా ఉండటం విశేషం. ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండగా, ఉన్నత పాఠశాలల్లో 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున పనిచేస్తున్నారు. పెద్ద రాష్ర్టాలతో పోల్చినా.. జాతీయ సగటు కన్నా మన రాష్ట్రంలో ఈ నిష్పత్తి ఉత్తమం. తెలంగాణ ఎప్పటికప్పుడు టీచర్లను నియమిస్తుండటంతోనే రాష్ట్రం ఆగ్రభాగాన కొనసాగుతున్నది.