జైపూర్: రోడ్డుపై గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు షాపులకు నిప్పుపెట్టారు. (Shops Set On Fire) పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇంటర్నెట్ను నిలిపివేశారు. రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దుగ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల శంభు సింగ్ వీడియోగ్రాఫర్. గురువారం పెళ్లి వేడుక వీడియో షూట్ కోసం బైక్‌పై వెళ్తుండగా కారును ఢీకొట్టాడు. ఈ సందర్భంగా కారులో ఉన్న వ్యక్తి, అతడి మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, ఈ గొడవ తర్వాత శంభు సింగ్ పెళ్లి వేడుక జరిగే మేఘావాల్ మొహల్లాకు వెళ్లాడు. కారులోని వ్యక్తి అతడ్ని అనుసరించాడు. పెళ్లి వేడుకను వీడియో తీస్తున్న శంభు సింగ్‌పై కాల్పులు జరుపడంతో అతడు మరణించాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న శంభు సింగ్ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడి మృతదేహంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విధ్వంసం సృష్టించారు. ఆరు షాపులకు నిప్పుపెట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒక పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఆరుగురు పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి.
కాగా, శంభు సింగ్‌పై కాల్పులు జరిపిన రెహాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు గంటలపాటు ఇంటర్నెట్ను నిలిపివేశారు. మృతుడి కుటుంబానికి పరిహారం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు.