న్యూఢిల్లీ: దేశ రాజధాని నడివీధుల్లో బుధవారం దిగ్భ్రాంతికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఉన్నావ్ రేప్ బాధితురాలు, ఆమె తల్లిని కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. బాధితురాలి తల్లిని వేగంగా వెళుతున్న బస్సులో నుంచి సీఆర్పీఎఫ్ సిబ్బంది తోసివేశారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో యావజ్జీవ కారాగారశిక్షను ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరటనివ్వడాన్ని నిరసిస్తున్న అత్యాచార బాధితురాలు, ఆమె తల్లిపై కేంద్ర బలగాలు ఢిల్లీలో దౌర్జన్యానికి పాల్పడ్డాయి. సెంగార్ జైలుశిక్షను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు పలు షరతులు విధిస్తూ అతడిని జామీనుపై విడుదల చేసింది. కేసులో తుది తీర్పు వచ్చే వరకు సెంగార్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్ష సస్పెన్షన్‌లో ఉంటుందని కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.
సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం..
2017 జూన్‌లో యూపీలోని ఉన్నావ్‌లో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడైన సెంగార్‌ను బీజేపీ 2019లో పార్టీ నుంచి బహిష్కరించింది. బాలికపై సెంగార్ అత్యాచారానికి పాల్పడినట్లు ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేసుకున్న సెంగార్‌కు జీవిత ఖైదును నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. అత్యాచార ఘటన అనంతరం తండ్రిని కోల్పోయి, కష్టాలపాలైన బాధితురాలు కోర్టు కూడా తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని స్పష్టం చేసింది.