UP | నిన్నటి వరకూ గోవా బీజేపీని కుదిపేసిన అసంతృప్తి మంటలు… ఇవ్వాళ యూపీని కూడా తాకాయి. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న కీలక వేళ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేసి, సంచలన సృష్టించారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆనందీబేన్ పటేల్‌కు పంపించారు. ‘కార్మిక ఉపాధి మంత్రిగా బాధ్యలు నిర్వర్తిస్తున్నాను. ప్రతికూల పరిస్థితులు, భిన్నమైన సైద్ధాంతిక దృక్పథం మధ్య ఉన్నా, నా బాధ్యతలు ఇప్పటి వరకూ నిబద్ధతతోనే నిర్వర్తించాను. దళితులు, వెనుకబడిన వర్గాలు, యువకులు, నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది. ఈ కారణంగానే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
బీజేపీని వీడి, స్వామి మౌర్య అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించడం గమనార్హం. సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం పోరాడే అత్యంత లోకప్రియ నేత స్వామి ప్రసాద్ మౌర్యతో సహా సమాజ్‌వాదీలో చేరబోతున్న వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అభినందనలు కూడా తెలుపుతున్నాను. అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు.
2017 ఎన్నికల కంటే ముందే మౌర్య సమాజ్‌వాదీని వీడి, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత మాయావతి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ సమాజ్‌వాదీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన మౌర్య.. ఆ వర్గంపై మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. సరిగ్గా ఎన్నికల కంటే ముందే పార్టీని వీడడం బీజేపీకి శరాఘాతమే.