Air India | భోపాల్, ఫిబ్రవరి 22: విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించినందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శనివారం ఎయిర్ ఇండియాపై మండిపడ్డారు. ప్రయాణికుల నుంచి పూర్తి చార్జీలను వసూలు చేసి వారికి విరిగిపోయిన సీట్లను కేటాయించడాన్ని అనైతిక చర్యగా ఆయన అభివర్ణించారు. విమాన ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
దీనికి వెంటనే ఎయిర్ ఇండియా స్పందించి మంత్రికి క్షమాపణలు చెప్పింది. ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. తన అనుభవాన్ని చౌహాన్ వివరిస్తూ పూసాలో జరగనున్న రైతుల ప్రదర్శన శాలను, ప్రారంభించి కురుక్షేత్రలో ప్రకృతి సేద్యం మిషన్ సమావేశంలో పాల్గొనేందుకు తాను భోపాల్ నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణించానని తెలిపారు. తనకు కేటాయించిన సీటులో కూర్చోగా అది విరిగిపోయి, కుంగిపోయి ఉండడాన్ని గమనించానని ఆయన చెప్పారు.