జ్ఞానవాపీ మసీదు విషయంలో శివసేన బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడింది. తన అధికారిక పత్రిక సామ్నా వేదికగా బీజేపీపై మండిపడింది.జ్ఞానవాపీ మసీదు లాంటి విషయాలను ఉటంకిస్తూ… 2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ వెళ్తుందని శివసేన అంచనా వేసింది. ఈ సందర్భంగా సామ్నా రష్యాతో భారత్‌ను పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది.
ఆరున్నర కోట్ల జనాభా వున్న ఫ్రాన్స్.. రఫేల్ విమానాలను తయారు చేసి, మార్కెటింగ్ చేసుకుంటోందని, అదే 130 కోట్ల జనాభా వున్న మన దేశం మాత్రం రోజూ మందిర్ మసీదు అంటూ పాత వాటిని తిరిగి తవ్వుకుంటోందంటూ శివసేన ఎద్దేవా చేసింది. దీనిని కొందరు అభివృద్ధి అంటూ మాట్లాడుతున్నారని, వారికి శతకోటి నమస్కారాలు అంటూ శివసేన చురకలంటించింది.
హనుమాన్ చాలీసా పారాయణం, భోంగా ఎపిసోడ్‌తో కథంతా నడిపించాలని బీజేపీ అనుకుందని, దీని అభివృద్ధి మోడల్ ఇలాగే వుంటుందని శివసేన సామ్నా వేదికగా దెప్పిపొడిచింది. ప్రతిసారీ రాముడి కథ, కృష్ణుడి కథను తెరపైకి తెస్తుందని పేర్కొంది. అయితే ఇవేవీ మూల కథలకు సంబంధం లేకుండా వుంటుందని, ప్రజలను రెచ్చగొట్టడం అన్న వ్యాపారం ప్రకారం బీజేపీ నడుస్తోందని శివసేన విమర్శించింది.
జమ్మూ కశ్మీర్‌లోని హిందువుల గురించి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని శివసేన ఫైర్ అయ్యింది. కశ్మీర్ లోయలో హిందువులపై దమన కాండ మళ్లీ ప్రారంభమైందని మండిపడింది. ఇప్పటికే అయోధ్య లైన్లో వుందని, ఇక కాశీ, మథుర బాకీ ఉండిపోయాయన్నారు. ఈ విషయాలన్నీ హిందువులను సంతోషపెట్టేవే అయినా…. కశ్మీర్ లోయలోని హిందువుల పరిస్థితి బాగోలేదని శివసేన సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.