బెంగళూరు, జూన్ 29: వచ్చే రెండు మూడు నెలల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ జోస్యం చెప్పారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందని ఊహాగానాలు వెలువడుతున్న వేళ డీకే సన్నిహితుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అధికారంలోకి రాక ముందు కర్ణాటకలో పరిస్థితి ఏమిటో మీకు తెలుసు. ఈ విజయం సాధించడానికి ఎవరు చెమటను చిందించారో, ఎవరు తీవ్రంగా కష్టపడ్డారో అందరికీ తెలుసు.
ఆయన (శివకుమార్) వ్యూహాలు, చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడు చరిత్ర సృష్టించాయి. డీకే సీఎం అవుతారనడంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. అధిష్ఠానం సరైన సమయంలో తగు నిర్ణయం తీసుకుని ఆయనకు అవకాశం ఇస్తుంది’ అని హుస్సేన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని సహకార మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల చేసిన ప్రకటనతో నాయకత్వ మార్పుపై కర్ణాటక కాంగ్రెస్లో ఊహాగానాలు తిరిగి ఊపందుకున్నాయి.