ముంబై : డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలోకి మారుతున్నట్టు శివసేన(యూబీటీ) ఎంపీలు అస్తికార్, నింబాల్కర్ ఆదివారం ధ్రువీకరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో అస్తికార్ మాట్లాడుతూ.. తాను సిద్ధాంతాలతో ఎలాంటి రాజీ పడలేదని, కేవలం ఒక శివసేన నుంచి మరొక శివసేలోకి వెళ్లానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల అభివృద్ధి నిధుల కొరత, పార్టీ కార్యకర్తల పనులు చేయించలేకపోవడం వంటి నష్టాలను తన ఫిరాయింపునకు ముఖ్య కారణాలుగా ఆయన పేర్కొన్నారు.
“నేను, కొందరు ఇతర ఎంపీలు జూన్ 18 వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గురువారం నుంచి మాపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇక ఇక్కడ ఉండటంలో అర్థం లేదని మేము భావించాం” అని అన్నారు. ఇద్దరు ఎంపీలు శివసేన షిండే వర్గంలోకి చేరుతామని ప్రకటించడంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ ఆపరేషన్ టైగర్ పూర్తయిందని చెప్పారు. ఫడ్నవీస్, రెబెల్ ఎంపీల వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్ వర్గం) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ ప్రజలు వారిద్దరిని శివసేన టార్చ్ గుర్తుపై ఎన్నుకొన్నారని అన్నారు.