Maharashtra | ముంబయి: మహారాష్ట్ర అధికార కూటమిలో శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ వర్గం) మధ్య లుకలుకలు మొదలయ్యాయి. సీఎం ఏక్నాథ్ షిండే మాటను ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లెక్కచేయటం లేదు. ఎన్సీపీ మంత్రుల పనులను సీఎం షిండే వర్గం సాగనివ్వటం లేదు. మొత్తంగా మహారాష్ట్రలో అధికార పార్టీల మధ్య పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతున్నది.
గత మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏకంగా సీఎం షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మధ్య మాటల యుద్ధం సాగినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. సీఎం షిండే చూస్తున్న అర్బన్ డెవలప్మెంట్కు చెందిన ఓ ఫైల్ డిప్యూటీ సీఎం ఆమోదం కోసం పంపగా, దాన్ని పెండింగ్లో పెట్టడం సీఎం ఆగ్రహానికి గురిచేసింది.
‘మీరు పంపిన ఫైల్స్ చూడకుండా సంతకం చేస్తున్నా కదా!’ అని సీఎం షిండే చెప్పినప్పటికీ, అజిత్ పవార్ సరిగా స్పందించలేదట. గత ఆరు నెలలుగా ఎన్సీపీ మంత్రులు పంపే ఫైళ్లను సీఎం ఆఫీస్ తొక్కపెడుతున్నదని, దీనికి ప్రతిగా సీఎంవో నుంచి వచ్చే ఫైళ్లకు అజిత్ పవార్ ఆమోదం తెలపటం లేదని సచివాలయంలో చర్చ సాగుతున్నది.