Minister Tanaji | ముంబై: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. క్యాబినెట్లోని ఎన్సీపీ మంత్రులపై శివసేన మంత్రి తానాజీ సావంత్ వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో తాను ఎన్సీపీ మంత్రుల పక్కన కూర్చుంటానని, దీంతో వికారంతో వాంతి వచ్చినట్టుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ధారాశివ్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తానాజీ వ్యాఖ్యలపై మిత్రపక్ష ఎన్సీపీ మండిపడింది.
అలాంటి ప్రకటనలు వినేకంటే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోవడం మంచిదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్సీపీ అధికార ప్రతినిధి ఉమేశ్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి బయటకు రావాలని పార్టీ సీనియర్ నేతలను కోరారు. సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) కూడా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే మహాయుతి కూటమికి ఇక ఎన్సీపీ అవసరం లేదన్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నది. ఎన్సీపీని బీజేపీ మహాయుతి కూటమి నుంచి బయటకు పంపే సమయం ఆసన్నమైందని తెలిపింది.