ముంబై: టీవీలో చర్చ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవమానించారని శివసేన నేత ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. (against Congress leader) టీవీ చర్చలో పాల్గొన్న మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలోక్ శర్మ, బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసు గురించి మాట్లాడారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ మహిళలపై అత్యాచారం చేస్తే మరాఠీ ప్రజలను బీజేపీ కాపాడుతుందా? అని ఆ పార్టీ నేతను అడిగారు.
కాగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలోక్ శర్మ, మరాఠీ కమ్యూనిటీని రేపిస్ట్ అని పిలిచారని సీఎం షిండే వర్గానికి చెందిన శివనేన నేత రాహుల్ ఎన్ కనల్ ఆరోపించారు. తన మద్దతుదారులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అలోక్ శర్మపై ఫిర్యాదు చేశారు. దీనికి ముందు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. మరాఠీ కమ్యూనిటీ రేపిస్ట్ అని అలోక్ శర్మ అన్నారని విమర్శించారు. ‘మేం ఆయనకు గుణపాఠం చెబుతాం. ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలను బానిసలుగా కాంగ్రెస్ చేసింది. కానీ వారు మరాఠీ సమాజాన్ని అగౌరవంగా చూడలేరు. మేమే నిజమైన శివసైనికులం. మరాఠీ వ్యక్తిత్వం, గౌరవం కోసం కాంగ్రెస్ కొమ్ములు విరుస్తాం’ అని అందులో పేర్కొన్నారు.