Uddhav Thackeray | తాము బీజేపీతో 30 ఏండ్లు మిత్రపక్షంగా కలిసి ఉన్నా గుర్తింపు కోల్పోని శివసేన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఎలా మారిపోతుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి మరో వర్షన్ శివసేన అంటూ తమ పార్టీ బీజేపీ చేసిన విమర్శలపై ఆయన ఘాటుగానే స్పందించారు. ఈ నెల 20న జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభల్లో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు.
‘మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మేం బాలా సాహెబ్ బాల్ ఠాక్రే సిద్ధాంతాలను మర్చిపోయాం అంటున్నారు. కానీ నేనెప్పుడూ సిద్ధాంతాన్ని వీడలేదు. కేవలం బీజేపీనే వదిలేశా. బీజేపీకే అసలు బాలా సాహెబ్ బాల్ ఠాక్రే సిద్ధాంతాల్లేవు. 25-30 ఏండ్లుగా బీజేపీతో కలిసున్నప్పుడు బీజేపీ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నంత మాత్రాన కాంగ్రెస్‌లా ఎలా మారిపోతాం’ అని ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు.
భారీ పరిశ్రమలన్నీ మహారాష్ట్ర నుంచి గుజరాత్ రాష్ట్రానికి తరలిపోతున్నాయని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపణలు గుప్పించారు. ఏక్ నాథ్ షిండే సర్కార్ అమలుచేస్తున్న లడ్కీ బహిన్ స్కీమ్’ మీద విమర్శలు చేశారు. గతంలో ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న బీజేపీ.. ఇప్పుడు రూ.1500 జమ చేస్తున్నదన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ఆ మొత్తం బక్క చిక్కిపోయి 15 పైసలవుతాయన్నారు. బీజేపీ హామీలన్నీ ఇలాగే ఉంటాయని ఎద్దేవా చేశారు.