మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామా చేస్తారా? చేయరా? ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. ఈడీ అరెస్ట్ చేయగానే ఆయన రాజీనామా చేసేస్తారని ఊహాగానాలు చెలరేగాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఇదే విషయంలో ఊగిసలాటలో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇదే విషయంపై సలహా కూడా అడిగారు. నవాబ్ మాలిక్‌తో రాజీనామా చేయించాల్సిన అవసరం లేదని మమత తెగేసి చెప్పడంతో ఈ వ్యవహారంపై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ స్పందించారు. మాట్లాడే వారి నోరుమూయించడం కోసమే ఈ అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. తాము న్యాయ పోరాటం చేస్తామని, అందులో ఆయన తప్పేమీ లేదని పేర్కొన్నారు. నవాబ్ మాలిక్ రాజీనామా చేయరని ఛగన్ భుజ్‌బల్ ప్రకటించారు.
ఇక నవాబ్ మాలిక్ రాజీమానాపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు. మంత్రి పదవికి నవాబ్ మాలిక్ రాజీనామా చేయరని ట్విట్టర్లో పేర్కొన్నారు. మహా వికాస్ అగాఢీతో నేరుగా తలపడలేకే… అఫ్జల్ లాగా వెనక నుంచి వెన్నుపోటు పొడిచారు. మోసపూరితంగా మంత్రిని అరెస్ట్ చేసి పండగ చేసుకుంటున్నారు. మంత్రి పదవికి నవాబ్ మాలిక్ రాజీనామా చేయరు. మేం ఇలాగే పోరాడతాం. కంసుడు, రావణుడు కూడా చంపబడ్డారు. పోరాడుతూనే వుంటాం. ఇదే హిందుత్వ. జై మహారాష్ట్ర అంటూ రౌత ట్వీట్ చేశారు.