Maharashtra | ముంబై, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి నూతన ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన గట్టిగా పట్టుబడుతున్నది. శివసేన అధికార ప్రతినిధి నరేశ్ మహస్కే బీహార్ మోడల్‌ను గుర్తు చేస్తున్నారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా, ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించారని చెప్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ డరేకర్ మాత్రం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎంపిక చేయాలని కోరుతున్నారు. రాష్ర్టాన్ని నడపటానికి ఆయనే అత్యంత సమర్థుడని వాదిస్తున్నారు. ఈ నెల 20న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి.
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం ఉంటుందని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ మహాయుతి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అది సాధ్యం కాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వార్తలు రాగానే, శివసేన నేతలు ఘాటుగా స్పందించారు. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేసినందువల్ల ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, లోక్ సభ సభాపతి ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురూ బీజేపీ నేతలతో సమావేశమై ప్రతిష్టంభనకు తెర దించుతారని తెలుస్తున్నది.
కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సోమవారం మాట్లాడుతూ, మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తగినవారని చెప్పారు. ఆయనకు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మద్దతిచ్చారన్నారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడుతుందన్నారు.
మరో సమాచారం ప్రకారం, మొదటి రెండున్నరేళ్లు ఫడ్నవీస్, మిగిలిన రెండున్నరేళ్లు షిండే సీఎం పదవిని నిర్వహించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తున్న ది. రెండున్నరేళ్ల తర్వాత ఫడ్నవీస్‌ను బీజే పీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరుగుతున్నది.