Shiv Pratap Shukla | హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంస్కృత భాషలో ప్రమాణం చేశారు. శివ ప్రతాప్ శుక్లాతో హిమాచల్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సబీనా ప్రమాణం చేయించారు. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, పలువురు కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ ఇంఛార్జ్ రాజీవ్ శుక్లా, ప్రతిపక్ష నాయకుడు జైరామ్ ఠాకూర్, హిమాచల్ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాస్ శుక్లా మాట్లాడుతూ.. తనకు సాదాసీదా జీవితాన్ని గడపడమంటే ఇష్టమన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎక్కువ భాగం రోడ్డు మార్గంలోనే తన ప్రయాణం సాగుతుందని, ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేందుకు ప్రయత్నిస్తానన్నారు. దేవభూమిలో తాను నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని చెప్పారు. తనను హిమాచల్ గవర్నర్‌గా నియమించింనందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతునన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు కృషి చేస్తానన్నారు.
అంతకుముందు గవర్నర్‌గా నియమితులైన శివ్ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రితో పాటు నలుగురు క్యాబినెట్ మంత్రులు ఘనంగా స్వాగతించారు. అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ పఠానియా, ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కశ్యప్ కూడా శివప్రతాప్ శుక్లాకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంస్కృతంలో ప్రమాణం చేసిన ఈయన మూడో వ్యక్తిగా నిలిచారు. అంతకుముందు విష్ణుకాంత్ శాస్త్రి, ఆచార్య దేవ్రత్ కూడా సంస్కృతంలోనే ప్రమాణం స్వీకరించారు.