ముంబై: మహారాష్ట్రలో ఎవరిది అసలైన శివసేన పార్టీ, ఆ పార్టీ గుర్తు ఎవరికి దక్కాలి అనే విషయంలో వివాదం కొనసాగుతున్నది. గత జూన్‌లో సీనియర్ నేత ఏక్నాథ్ షిండే శివసేన పార్టీని చీల్చి బీజేపీ పంచన చేరారు. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ వైపు వెళ్లి శివసేన ప్రభుత్వాన్ని కూల్చారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యారు.
అంతటితో ఆగక అసలైన శివసేన పార్టీ తనదే అంటున్నాడు. రాష్ట్రంలో శివసేన పార్టీ తమదేనని గుర్తించాలని, పార్టీ గుర్తును తమకే కేటాయించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఉద్ధవ్ థాకరే అభిప్రాయం కోరింది. షిండే వాదనపై సమాధానం అడిగింది. దాంతో అసలైన శివసేన పార్టీ తమదేనని ఉద్ధవ్ చెప్పారు.
ఏక్నాథ్ షిండే వర్గం పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయిందని, కాబట్టి పార్టీపైనగానీ, పార్టీ గుర్తుపైనగానీ వాళ్లకు ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టంచేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణంతో అంధేరీ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ఉద్ధవ్ వర్గం లట్కే సతీమణి రుతుజా లట్కేని బరిలో దించింది. షిండే వర్గం బీజేపీ అభ్యర్థి ముర్జి పటేల్‌కు మద్దతు ప్రకటించింది.