న్యూఢిల్లీ : నిరసనల పేరుతో బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టించారని, తన తండ్రి, పోరాట వీరుల త్యాగాల్ని అవమానించారని మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు. సైనిక తిరుగుబాటు వెనుకున్న రాజకీయ శక్తులపై ఆమె మండిపడ్డారు. దేశ ప్రజలే తనకు న్యాయం చేకూర్చాలని అన్నారు. దేశాన్ని వీడిన తర్వాత షేక్ హసీనా, మంగళవారం తొలిసారి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘జాతిపిత, బంగబంధు షేక్ ముజ్బర్ రెహమాన్, ఆయన నాయకత్వంలో స్వతంత్ర దేశంగా ఆత్మ గౌరవాన్ని, స్వంత గుర్తింపు అందుకున్నాం. దీనినంతటినీ దారుణంగా అవమానించారు’ అంటూ తిరుగుబాటు వెనుకున్న శక్తులపై ఆమె మండిపడ్డారు.
బంగ్లాదేశ్లో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ, తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ మంగళవారం ‘ఢాకేశ్వరీ ఆలయాన్ని’ సందర్శించారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి హక్కుల్ని కాపాడటంపై తన ప్రభుత్వం దృష్టిసారిస్తున్నదని యూనస్ చెప్పారు. హిందువులు, ముస్లింలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ప్రజలందరికీ ఒకే రాజ్యాంగం, చట్టముందని, మతపరంగా విడిపోరాదని యూనస్ చెప్పారు. ‘మన మధ్య ఉన్న వివాదాల్ని పక్కకుపెట్టి, మనమంతా ఒక్కటేనని చూపాలి’ అని అన్నారు.