ముంబై, అక్టోబర్ 3: డ్రగ్స్ వినియోగం కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. ముంబై తీరంలో కార్డీలియా క్రూజ్ షిప్ ‘ఎంప్రెస్’లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో అధికారులు శనివారం రాత్రి దాడి చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎండీఎంఏ, ఎక్టసీ, కొకైన్, ఎండీ, చరాస్ లాంటి భిన్న రకాల మాదకద్రవ్యాలను అధికారులను స్వాధీనం చేసుకొన్నారు. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో ఈ రైడ్ జరిగింది. అదుపులోకి తీసుకొన్న ఎనిమిది మందికి ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంత రం అరెస్టు చేశారు. వారిని కోర్టు ముందు హాజరుపర్చారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి కోర్టు ఒక రోజు రిమాండ్ విధించింది. డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ కలిగి ఉండటం తదితర సెక్షన్ల కింద పోలీసులు ఆర్యన్ ఖాన్‌పై కేసులు నమోదు చేశారు. అయితే, ఆర్యన్ ఖాన్.. తాను డ్రగ్స్ కొనలేదని రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. ఆర్యన్ ఖాన్ షారుక్, గౌరీల పెద్ద కుమారుడు. వీరికి కుమార్తె సుహానా ఖాన్, మరో కుమారుడు అబ్రామ్ కూడా ఉన్నారు.
3 రోజుల మ్యూజికల్ నైట్!
సముద్రం మధ్యలో మూడు రోజుల మ్యూజికల్ నైట్‌లో భాగంగా నౌకలో ఎఫ్‌టీవీ ఇండియా ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. నౌక ముంబై నుంచి గోవా వెళ్తున్నది. ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ కషీఫ్ ఖాన్‌తో పాటు పార్టీ ప్లాన్ చేసిన కొంత మందికి ఎన్సీబీ సమన్లు పంపింది. పార్టీ శనివారం-ఆదివారం వరకు జరగాల్సి ఉంది. కానీ, పార్టీపై సమాచారం ఉండటంతో ఎన్సీబీ రైడ్ చేసింది.