ముంబై : విపక్ష కూటమి ఇండియాలో భాగస్వామ్య పార్టీలైన ఆప్, కాంగ్రెస్‌లు పంజాబ్‌లో కత్తులు దూసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది. విపక్ష ఇండియా కూటమిలో ఈ పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నా పంజాబ్ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా, సీఎం భగవంత్ మాన్ మధ్య వైరం నెలకొంది. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ వివాదం ప్రభావం విపక్ష కూటమిపై ఉండబోదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) స్పష్టం చేశారు. ఈ అంశాలు విపక్ష ఇండియా కూటమి భవితవ్యంపై ప్రభావం చూపవని పవార్ పేర్కొన్నారు.
ఈ తరహా ఘటనలు చోటుచేసుకోరాదని అనడంతో తాను అంగీకరిస్తానని, అయితే ఈ విషయాలు విపక్ష ఇండియా కూటమి భవితవ్యాన్ని నిర్ధేశించవని ఆయన స్పష్టం చేశారు. కాగా, పంజాబ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్దానాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించాలని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా కోరారు. ఆపై భగవంత్ మాన్ ప్రభుత్వం రెండు నెలలు కూడా అధికారంలో ఉండదని, ఆప్ సర్కార్‌లో 32 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు.
బాజ్వా వ్యాఖ్యలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం గురించి బాజ్వా మాట్లాడుతున్నారని సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. సీఎం కావాలనే బాజ్వా ఆశలు వమ్ము కావడంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని, మీకేమైనా ఇబ్బందులుంటే పార్టీ హైకమాండ్‌తో మాట్లాడుకోవాలని మాన్ హితవు పలికారు. విపక్ష ఇండియా కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్న క్రమంలో కూటమిలో భాగస్వామ్య పార్టీలైన ఆప్, కాంగ్రెస్‌లు పంజాబ్‌లో కత్తులు దూయడంపై కూటమి పక్షాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Read More :