ముంబై, ఆగస్టు 10: మహారాష్ట్రలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ప్రయత్నాలు జరిగాయని, తనకు కూడా ఆ అనుభవం ఎదురైందని ఎన్సీపీ (శరద్ పవార్) అధ్యక్షుడు శరద్‌పవార్ శనివారం వెల్లడించారు. 2024లో మహారాష్ట్ర ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చి ఈవీఎంలను నియంత్రించడం ద్వారా తమకు చెందిన మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమి ఎన్నికల్లో మొత్తం 288 సీట్లలో 160 గెలిచేలా చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఇవే తరహా ఆరోపణలు చేశారు. తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కూడా ఇద్దరు వ్యక్తులు ఎన్నికల ముందు కలిసి తమ పార్టీకి 60-65 సీట్లు వచ్చేలా చేస్తామని ప్రలోభ పెట్టారని తెలిపారు. కాగా, పవార్ ఆరోపణలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఖండించారు. ఈవీఎంలను మేనేజ్ చేస్తామని అన్నప్పుడు మీరు పోలీసులకో, ఈసీకో ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.