ముంబై: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు నాయకత్వం వహిస్తానన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సమర్థ నాయకురాలని ఆయన ప్రశంసించారు. శనివారం కొల్హాపూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే ఉద్దేశం, హక్కు మమతా బెనర్జీకి ఉన్నాయని చెప్పారు. ‘దేశంలో సమర్థ నాయకురాలు. కూటమికి నాయకత్వం గురించి చెప్పే హక్కు ఆమెకు ఉంది. ఆమె పార్లమెంటుకు పంపిన ఎంపీలు కష్టపడి పని చేయడంతోపాటు అవగాహన కలిగి ఉన్నవారు’ అని అన్నారు.
కాగా, హర్యానా, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది. దీంతో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడంపై పలు ప్రాంతీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ దీనిపై ఇటీవల స్పందించారు. ‘ఇండియా’ కూటమికి నాయకత్వం వహించడానికి సుముఖత వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే ప్రతిపక్ష ఫ్రంట్‌ను నడిపే బాధ్యతను కూడా తాను నిర్వహించగలనని మీడియాతో అన్నారు.