Heatwaves | వానాకాలం వచ్చేసింది. పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో పలురాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నది. జూన్ మాసం ముగింపునకు చేరుతున్నా చాలా ప్రాంతాల్లో వడగాలుల విధ్వంసం కొనసాగుతున్నది. దాంతో జనం ఎండవేడికి అల్లాడుతున్నారు. మరో వైపు కొండ ప్రాంతాల్లోనూ ఈ సారి వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వేడి, వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, జమ్మూ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్‌లలో వేడిగాలులు కొనసాగుతాయని చెప్పింది. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 8.30 గంటలకు 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సోమవారం అత్యధికంగా ఢిల్లీలోని ఆయనగర్‌లో 46.4 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 19న ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో తీవ్ర వేడి, వడగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 18 నుంచి 19 వరకు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావం కనిపిస్తుందని పేర్కొంది. అరేబియా సముద్రం నుంచి వీచే నైరుతి గాలుల కారణంగా.. వాతావరణం తేమగా ఉంటుందని చెప్పింది. పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ఈ నెల 19 నుంచి పంజాబ్, హర్యానాలలో వడగాలుల నుంచి కాస్త ఉపశమనం ఉంటుందని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు.
రాబోయే రెండు రోజుల పాటు హిమాచల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలుల వీస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 13న హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు నమోదైంది. ఉత్తర భారతదేశం, వాయువ్య హిమాలయ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు సోమసేన్ తెలిపారు. వీటన్నింటి మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మేఘాలయ, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌లో రానున్న మూడు నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.