Weather | న్యూఢిల్లీ, డిసెంబర్ 25 : తీవ్రమైన చలి… దానికి తోడు చల్లని గాలులు ఉత్తర భారతాన్ని గజ గజ వణికిస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్లలో బుధవారం ఉష్ణోగ్రతలు సున్నా కన్నా దిగువకు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్లను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాదిలోని పలు రాష్ర్టాల ప్రజలు చలి తీవ్రత వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీకి వెళ్లే 20కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, దట్టంగా కురుస్తున్న మంచు వల్ల విమాన సర్వీసులు ప్రభావితమైనట్టు అధికారులు బుధవారం ప్రకటించారు.
రోడ్ల మీద దట్టమైన పొగ మంచు ఆవరించి ఉండటంతో..వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం వల్ల ఎత్తయిన ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి. పలు జిల్లా ల్లో రహదారులను మూసేశారు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల వాహనాలు జారటం వల్ల జరిగిన ప్రమాదాల్లో గత 24 గంటల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.