కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 12: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర పోరులో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లోని దక్షిణ అబూజ్మడ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమవుతున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో నారాయణ్‌పూర్ జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ) బలగాలతో పాటు దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాల సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరికి మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టుల మృతి చెందారు.