Assam Floods | అస్సాంలో వరద (Assam Floods) బీభత్సం కొనసాగుతోంది. ఈ వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా కురిసిన కుంభవృష్టి వర్షాలకు అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ నీరంతా సమీప గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రజలు వరదలకు తీవ్ర ప్రభావితులయ్యారు. శుక్రవారం మరో ఏడు మరణాలు సంభవించాయి. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 90కి పెరిగింది.
అస్సాం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (Assam State Disaster Management Authority) ప్రకారం.. సుమారు 24 జిల్లాల్లోని 12.33 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. ప్రస్తుతం వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ 75 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 2,406 గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. 32,924.32 హెక్టార్లలో సాగు భూములు ముంపునకు గురయ్యాయి. ఈ వరదలకు ధుబ్రి జిల్లాలో 18,326 మంది, కాచర్‌లో 1,48,609 మంది, గోలాఘాట్‌లో 95,277 మంది, నాగాన్‌లో 88,120 మంది, గోల్‌పరాలో 83125 మంది, మజులిలో 82,494 మంది, సౌత్ సల్యాజీలో 73,662 మంది, ధేమాజీలో 73,662 మంది ప్రజలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ఇక వరద ప్రభావిత జిల్లాల్లోని 316 సహాయ శిబిరాల్లో 2.95 లక్షల మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.
ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park)ను ఇటీవలే కాలంలో ఎన్నడూ లేనివిధంగా వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు 6,67,175 జంతువులు ప్రభావితమైనట్లు ఏఎస్డీఎమ్ఏ పేర్కొంది. వందకు పైగా జంతువులు మృతి చెందినట్లు తెలిపింది. అనేక జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అదికారులు వెల్లడించారు.
Also Read..
Radhika Merchan | వెడ్డింగ్ లుక్‌లో మెరిసిన రాధికా మర్చంట్..
Anant Weds Radhika | అనంత్‌తో పెళ్లి.. రాధికా మర్చెంట్ వెడ్డింగ్ లుక్ చూశారా.. ఫొటోలు వైరల్
Bypolls | 13 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు