Bihar Congress : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress party) ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఏడుగురు సీనియర్ నాయకులపై వేటువేసింది. ఆరేళ్లపాటు వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దుచేసింది.
పార్టీ క్రమశిక్షణ కమిటీ సమీక్ష చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. వేటుపడిన వారిలో పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య పాశ్వాన్, మరో మాజీ ఉపాధ్యక్షుడు షకీల్ ఉర్ రెహమాన్, కిసాన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ శర్మ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ కుమార్ రంజన్, మరో మాజీ అధ్యక్షుడు కుందన్ గుప్తా, బంకా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంచన కుమారి, నలంద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు రవి గోల్డెన్ ఉన్నారు.
పై ఏడుగురు నేతలు తరచూ మీడియాలో పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు క్రమశిక్షణ కమిటీ తేల్చింది. ఆ ఏడుగురు నేతల నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చామని, అయినా ఆ నోటీసులకు వారు సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదని, దాంతో బహిష్కరణ వేటు వేశామని తెలిపింది.