తమిళనాడు సర్కార్, గవర్నర్కు సుప్రీంకోర్టు స్పష్టం
న్యూఢిల్లీ, జనవరి 17: బిల్లుల ఆమోదానికి సంబంధించి తమిళనాడు సర్కార్, ఆ రాష్ట్ర గవర్నర్ రవి మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభనపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ సమయానికి సమస్యను ఇరు పార్టీలు పరిష్కరించుకోకపోతే తామే పరిష్కరిస్తామని చెప్పింది. వీసీల నియామకాల బిల్లుతోపాటు మరో ఎనిమిది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని స్టాలిన్ సర్కార్ సుప్రీం కోర్టుకు నివేదించింది. గవర్నర్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధమని వాదించింది. బిల్లులకు గవర్నర్ రవి ఆమోదం తెలపకపోవడంపై సుప్రీంకోర్టు గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని 200 అధికరణ ప్రకారం గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లులను ఆమోదించడం లేదా అనుమతి నిలిపేయడం లేదా వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపడం చేయాలని చెప్పింది. అయినా గవర్నర్ ఆ సూచనలను పెడచెవిన పెడుతూ వస్తున్నారు.