న్యూఢిల్లీ, నవంబర్ 12: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడుల తరహాలో 200 బాంబులను(ఐఈడీలు) ఉపయోగించి దాడులు నిర్వహించాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదులు ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్తోసహా అనేక కీలక ప్రదేశాలను, గౌరీ శంకర్ మందిరాన్ని తమ దాడుల కోసం ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. ఉగ్రవాదుల టార్గెట్‌లో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, భారీ షాపింగ్ మాల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇందుకు సంబంధించిన కుట్ర జరుగుతోందని, ఈ కుట్ర సూత్రధారి అయిన ఉగ్ర మాడ్యుల్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. గడచిన అనేక నెలలుగా 200 బాంబుల(ఐఈడీలు) తయారీలో ఉగ్రవాదులు నిమగ్నమై ఉన్నారని వారు చెప్పారు. దేశంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకే ప్రార్థనా స్థలాలపై దాడులు చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.
హర్యానాలో మౌల్వీ అరెస్టు
ఉగ్ర మాడ్యుల్‌పై దర్యాప్తులో భాగంగా హర్యానాలోని మేవట్కు చెందిన ఇష్తియాక్ అనే మౌల్వీని జమ్ము కశ్మీరు పోలీసులు బుధవారం అరెస్టు చేసి శ్రీనగర్‌కు తీసుకువెళ్లారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఓ అద్దె ఇంట్లో మౌల్వీ నివసిస్తున్నాడు. అతని ఇంటి నుంచే 2,500 కిలోలకు పైగా అమ్మోనియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్‌ని భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. మంగళవారం రాత్రి కశ్మీరులో మరో డాక్టర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనగర్‌లోని ఎస్ఎంహెచ్ఎస్లో పనిచేస్తున్న డాక్టర్ తాజాముల్ అరెస్టుతో పేలుడు కేసుకు సంబంధించి కశ్మీరులో మొత్తం నలుగురు డాక్టర్లు అరెస్టయ్యారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టయ్యారు.
ఎరుపు రంగు ఫోర్డ్ కారు స్వాధీనం
ఎర్ర కోట పేలుడు కేసులో ప్రధాన అనుమానితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న డీఎల్10సీకే0458 అనే ఎరుపు రంగు ఫోర్ట్ ఎకోస్పోర్ట్ కారు కోసం విస్తృతంగా గాలింపు చేపట్టిన ఢిల్లీ పోలీసులు చివరకు ఆ కారును హర్యానాలోని ఖండవలి గ్రామంలో బుధవారం కనుగొన్నారు. అందులో పేలుడు పదార్థాలు ఏవైనా పెట్టారా అన్న విషయాన్ని తేల్చేందుకు నిపుణులను రప్పించారు.
రిపబ్లిక్ డే నాడు దాడికి పథకం
ఈ ఏడాది జనవరిలో ఎర్ర కోట వద్ద డాక్టర్ ముజమ్మిల్ పలుసార్లు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైందని అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నాడు ఎర్ర కోటపై దాడి చేసేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో భాగంగానే ఈ రెక్కీ జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడ పటిష్టమైన పోలీసు పెట్రోలింగ్ ఉండడంతో వారి కుట్ర భగ్నమైందని చెప్పారు.
డిసెంబర్ 6న భారీ పేలుడుకు ప్లాన్
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న భారీ పేలుడుకు రెడ్ ఫోర్ట్ సమీపంలో పేలుడుకు గురైన కారును నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీ కుట్ర పన్నినట్లు బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్రాష్ట్ర వైట్ కాలర్ జైషే మొహమ్మద్ ఉగ్ర మాడ్యుల్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణపై అరెస్టయిన 8 మందిని పోలీసులు ప్రశ్నించగా ఈ సంచలన వివరాలు వెల్లడైనట్లు ఆ వర్గాలు చెప్పాయి.
కశ్మీరులోని పుల్వామా జిల్లాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడు ఘటనలో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కశ్మీరు, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు విస్తరించిన ఉగ్ర మాడ్యుల్లో డాక్టర్ ఉమర్ కూడా కీలక సభ్యుడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తన బృందంలో సభ్యుడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టుతో ఉమర్ కుట్ర విఫలమైందని, తనను కూడా అరెస్టు చేస్తారన్న భయంతోనే అతను ఐ20 కారులో పేలుడు పదార్థాలను నింపి రెడ్‌ఫోర్ట్ సమీపంలో పేల్చివేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.