న్యూఢిల్లీ: చిరకాలంగా మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను ఎన్నికలైన వెంటనే వీడిన కాంగ్రెస్ వైఖరిని అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ తీవ్రంగా తప్పుబట్టారు. అది అనైతిక చర్యగా విమర్శించిన ఆయన నీచపరమైన స్వార్థపరత్వాన్ని తలపించిందని వ్యాఖ్యానించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలపడాన్ని ఆయన తప్పుబడుతూ స్వరాజ్యం అనేది నైతికతపై ఆధారపడిన ప్రభుత్వమై ఉండాలన్న మహాత్మా గాంధీ 1925 నాటి సూత్రాన్ని హస్తం పార్టీ ఉల్లంఘించిందని అన్నారు.
తాము టీవీకేలో చేరిన వెంటనే ఇతర చిన్న పార్టీలు కూడా తమలా టీవీకేలోకి వస్తాయని కాంగ్రెస్ వేసిన అంచనా విఫలమైందని, అందుకే టీవీకే ఇంతవరకు పూర్తి మెజారిటీని సాధించలేక పోతున్నదని ఒక ఆర్టికల్‌లో ఆయన విమర్శించారు. ‘తమిళనాడులో కాంగ్రెస్ ఐదు సీట్లను గెల్చుకుంది. అదీ సొంత బలంపై కాదు. దశాబ్దాలుగా తోడుగా ఉన్న డీఎంకే భాగస్వామ్యం అండతోనే’ అని ఆయన స్పష్టం చేశారు. విజయ్‌తో చేరడం ద్వారా అనైతికతకు పాల్పడటమే కాక, ఆయనకు మెజారిటీ ఉండేలా చూడకపోవడం అనే రాజకీయ మూర్ఖత్వానికి పాల్పడ్డామని పేర్కొన్నారు.