ఆగ్రా : నేడు చిన్న కుటుంబాల్లో అవ్వతాతలు లేకపోవడం వల్ల చిన్నారులకు కథలు, నీతి బోధలు చెప్పేవారు ఉండటం లేదు. అదే సమయంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులు ఈ లోటును పూడ్చే అవకాశం ఉంది. వృద్ధులను అద్దెకిచ్చే జపాన్‌లోని విధానాన్ని ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం భారత్‌లో మొదటిసారిగా ప్రారంభించింది. ఇందులో భాగంగా వృద్ధాశ్రమంలోని సీనియర్ సిటిజన్లను నెలవారీ అద్దెకు తీసుకోవచ్చు.
ఇందుకోసం అద్దెకు తీసుకోవాలనుకున్న కుటుంబాలు వృద్ధాశ్రమం వద్ద రూ.11 వేలు డిపాజిట్ చేయాలి. ఇందులో సగం అద్దెకు వెళ్లే సీనియర్ సిటిజన్లకు ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని వృద్ధాశ్రమం నిర్వహణకు ఉపయోగిస్తారు. ఈ అద్దె విధానం ఆలోచన కేవలం ఆర్థికపరమైనది కాదని.. లోతైన భావోద్వేగపరమైనది కూడానని వృద్ధాశ్రమం స్పష్టం చేసింది.