ముంబై: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు, వైద్య సిబ్బందిపై దాడి చేసిన ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన కార్పొరేటర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Sena Corporator Arrested) జూలై 6న సాయంత్రం వేళ మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివ్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళం చెలరేగింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నిండిపోవడంతో పరిస్థితి సీరియస్‌గా ఉన్న శిశువును మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆ కుటుంబానికి వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో స్థానిక శివసేన కార్పొరేటర్‌కు వారు ఫోన్ చేశారు.
కాగా, స్థానిక శివసేన కార్పొరేటర్ రమేష్ మహాత్రే తన అనుచరులతో కలిసి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఫోన్ మాట్లాడుతున్న వైద్యురాలు సృష్టి బావిస్కార్పై వెనుక నుంచి బలంగా కొట్టారు. ఆ తర్వాత తన అనుచరులతో కలిసి మరో డాక్టర్, వైద్య సిబ్బందిపైనా చేయి చేసుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా భయాందోళన చెందారు.
మరోవైపు శివసేన కార్పొరేటర్ రమేష్ మహాత్రే డాక్టర్లపై దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. శివసేన కార్పొరేటర్ రమేష్ మహాత్రేతో పాటు మరో ఐదుగురిపై మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. బుధవారం రమేష్ మహాత్రేను ఆయన ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు.