న్యూఢిల్లీ, జనవరి 1: కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. కొత్త ఆలోచనలు, ఆకాంక్షలతో యావత్ ప్రపంచం 2023 సంవత్సరంలోకి ప్రవేశించింది. దీన్ని రాజకీయ నామ సంవత్సరంగా కూడా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 9 రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇవి బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలతోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలకూ కీలకంగా నిలవనుండటంతో ఈ ఎన్నికలను 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల సమరానికి సెమీఫైనల్‌గా పరిగణిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్‌కు ఈ రాష్ర్టాలు ఎంతో ముఖ్యమైనవి కావడమే ఇందుకు కారణం. వీటితోపాటు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన టీఆర్ఎస్కూ 2023 చాలా కీలకమైనదే. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయభేరి మోగించడంతోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది.
2023లో ఎన్నికలు జరిగే రాష్ర్టాలు
ఈ ఏడాది ఎన్నికలు జరిగే 9 రాష్ర్టాలకు గానూ కేవలం ఐదు రాష్ర్టాల్లోనే 110 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మిగిలిన నాలుగు ఈశాన్య రాష్ర్టాలు. కేవలం 6 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్న ఈ నాలుగు రాష్ర్టాల్లో మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ శాసనసభలకు ఫిబ్రవరి-మార్చిలో.. మిజోరం అసెంబ్లీకి నవంబర్ చివరిలోగా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం త్రిపురలో స్థానిక భాగస్వామి ఐపీఎఫ్టీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ.. నాగాలాండ్, మేఘాలయలో ప్రాంతీయ మిత్రపక్షాలకు జూనియర్ భాగస్వామిగా కొనసాగుతున్నది. మిజోరంలో ఈసారి కాంగ్రెస్, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశం ఉన్నది. 2018లో తొలిసారి త్రిపురను గెలుచుకున్న బీజేపీ ప్రస్తుతం పెద్ద సంఖ్యలో అంతర్గత తిరుగుబాట్లను ఎదుర్కొంటుండటంతో అందరూ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
మధ్యప్రదేశ్
ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో జరుగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాంగ్రెస్‌లో తిరుగుబావుటా ఎగురవేయించి బీజేపీ అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణ
దేశంలో అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో ఎన్నికలు జరుగనున్నాయి. అలుపెరుగని పోరాటంతో సాధించుకున్న తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు తీయిస్తున్న ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా పేరు మార్చుకొని మరోసారి కాంగ్రెస్, బీజేపీని చిత్తు చేసేందుకు సిద్ధమవుతున్నది. జాతీయ రాజకీయాల్లో పెద్ద పాత్రను పోషించడం ద్వారా దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.
కర్ణాటక
దక్షిణాదిలో బీజేపీకి పట్టున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకే. ఈ రాష్ట్ర శాసనసభకు మే నెలలో జరుగనున్న ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొనే అవకాశాలున్నప్పటికీ దక్షిణ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జేడీఎస్ కూడా బలంగా ఉన్నది. గతంలో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని 2019లో బీజేపీ కూల్చిన విషయం విదితమే. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ అంతర్గత తిరుగుబాట్లతో సతమతమవుతున్నది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది.
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్
ఈ రెండు రాష్ర్టాల్లో వరుసగా రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యం నెరవేరితే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలు మెరుగుపడటంతోపాటు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బలోపేతమయ్యేందుకు దోహదం చేస్తుంది.