హరిద్వార్: ప్రధాని మోదీకి సుదీర్ఘ ఆయువును ఇవ్వాలని కోరుతూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఇవాళ పూజలు నిర్వహించారు. హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయంలో ఆయన యజ్ఞం నిర్వహించారు. హర్యానా స్పీకర్ గియాన్ చాంద్ గుప్తా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోదీ కాన్వాయ్‌కు భద్రతా సమస్య ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పంజాబ్ సీఎం చన్నీని ఖట్టర్ తప్పుపట్టారు. చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం ఖట్టర్ కోరారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈనెల అయిదో తేదీన ఫిరోజ్‌పూర్ వెళ్లాలనుకున్న ప్రధాని తన కాన్వాయ్‌ను ఓ ఫ్లైఓవర్‌పై 20 నిమిషాల పాటు ఆపిన విషయం తెలిసిందే. రైతుల ధర్నా వల్ల ప్రధాని కాన్వాయ్‌ను నిలిపేశారు. ఈ ఘటన గురించి దర్యాప్తు చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ సంఘటనా స్థలాన్ని విజిట్ చేసింది. ప్రస్తుతం ఫిరోజ్పూర్లో కేంద్ర హోంశాఖ కమిటీ విచారణ ప్రారంభించింది.
ప్రధాని భద్రతా వైఫల్యంపై పంజాబ్ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి ఓ నివేదికను సమర్పించింది. ఈ అంశంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పంజాబ్ చెప్పింది. ఇద్దరు సభ్యుల ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పంజాబ్ వెల్లడించింది. భద్రతా లోపం గురించి ఆ రాష్ట్ర కార్యదర్శి అనిరుధ్ తివారీ ఓ నివేదికను కేంద్రానికి సమర్పించారు. ప్రధాని టూర్‌కు సంబంధించిన వివరణాత్మక రిపోర్ట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.