ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిందుకు ప్రయత్నించిన ఇద్దరిని మంగళ, బుధవారాల్లో అరెస్ట్ చేసినట్టు గురువారం ముంబై పోలీసులు తెలిపారు. వీరిద్దరు వేర్వేరుగా బాంద్రా(పశ్చిమ)లోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న సల్మాన్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని వెల్లడించారు.
నిందితులను జితేంద్ర కుమార్ సింగ్(23), ఇషా ఛబ్రా(32)గా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జితేంద్ర మంగళవారం ఉదయం సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తచ్చాడుతూ కనిపించాడు. అక్కడి నుంచి వెళిపోవాలని ఓ పోలీస్ అతడిని అడిగినప్పడు అతడు తన మొబైల్ ఫోన్ నేల కొసి కొట్టాడు. అదే రోజు సాయంత్రం అతడు వేరొకరి కారులో ప్రయాణించి గెలాక్సీ అపార్ట్మెంట్లోకి చేరుకున్నాడు.
అతడిని మరోసారి గుర్తించిన పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అయితే సల్మాన్‌ను కలిసేందుకే తాను వచ్చానని అతడు విచారణలో తెలిపాడు. ఇషా.. సల్మాన్ ఇంటికి వెళ్లేందుకు బుధవారం అపార్ట్మెంట్లోని లిఫ్ట్ వరకు చేరుకుంది. పోలీసులు అనుమానంతో ఆమెను అరెస్ట్ చేశారు.