
China on India | భారత్‌పై డ్రాగన్ కండ్లు మండాయి. థర్డ్ పార్టీ నుంచి సెక్యూరిటీ ముప్పు ఉందని పేర్కొంటూ శ్రీలంకలో చేపట్టిన మూడు హైబ్రీడ్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరిలో సినో సోర్ హైబ్రీడ్ టెక్నాలజీ సంస్థకు తమిళనాడుకు సమీపంలో ఉన్న డెల్ఫ్ట్, నాగద్వీప, అనల్థీవు దేవుల్లో హైబ్రీడ్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్ అప్పగించింది. ఇవి జఫ్నా కోస్తా తీరం వెంబడే ఉంటాయి. తమిళనాడుకు ఈ మూడు దీవులు సమీపంలోనే ఉంటాయని ఓ వెబ్సైట్ గురువారం వార్త ప్రచురించింది.
భారత్ పేరెత్తకుండానే థర్డ్ పార్టీ నుంచి సెక్యూరిటీ ముప్పు ఉందంటూ సినో సోర్ హైబ్రీడ్ టెక్నాలజీ సంస్థ.. శ్రీలంకలోని ఉత్తరాన గల మూడు దీవుల్లో నిర్మించ తలపెట్టిన హైబ్రీడ్ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం ధృవీకరించింది. దీనికి బదులు మాల్దీవులలోని 12 దీవుల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు గత నెల 29న ఆ దేశంతో చైనా ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంతకుముందు మూడు శ్రీలంక దీవుల్లో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కాంట్రాక్ట్‌ను చైనాకు కట్టబెట్టడంపై శ్రీలంకకు భారత్ ఈ ఏడాది ప్రారంభంలోనే తీవ్ర నిరసన తెలిపింది.