CDS Anil Chauhan | ప్రపంచమంతా గందరగోళంలో ఉందని.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక దశ అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. ఢిల్లీలో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) ఆధ్వర్యంలో సైనిక మందుగుండు సామగ్రిపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచ భౌగోలిక రాజకీయ వాతావరణం మారుతున్న స్థితిలో ఉందన్నారు. రెండు యుద్ధాల కారణంగా ప్రపంచ భద్రతా వాతావరణం మారిపోయిందన్నారు. మనం చుట్టూ చూసిన సమయంలో ప్రపంచం కల్లోలం ఉందని కనిపిస్తుందన్నారు. లిబియా, సిరియా, యెమెన్, అర్మేనియాలో యుద్ధాలు కొంతకాలంగా శాంతించిందన్నారు. కానీ, శాశ్వత శాంతి ఇప్పటికీ అస్పష్టంగా ఉందన్నారు. మయన్మార్, సూడాన్, కాంగోలో విభేదాలు ఉన్నాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న హింసాకాండ రక్షణ సామాగ్రితో సహా ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేసింది. ఈ పరిణామం భారత్కు కూడా ఒక అవకాశమన్నారు. బంగ్లాదేశ్లో ఇటీవలి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారతదేశ సరిహద్దు పరిస్థితులపై స్పందించారు. భారతదేశానికి భద్రతా సవాళ్లు ఉన్నాయని.. జమ్మూ కశ్మీర్లో పాక్.. చైనాతో చాలాకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం ఇప్పటికీ కొలిక్కి రాలేదన్నారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దాంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో పాటు దేశాన్ని విడిచి వదిలివెళ్లాల్సి వచ్చింది. వేలాది మంది నిరసనకారులు ఆమె నివాసంలోకి చొరబడి ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయాలకు సైతం నిప్పుపెట్టి సంబరాలు చేసుకున్నారు. నోబెల్ పురస్కారం గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నది.