న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం మౌళిక రూపకల్పనలో.. లౌకికవాదం(Secularism) అనే భావన కూడా ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. లౌకికవాదం, సామ్యవాదం పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ ఎంపీ సుబ్రమణియం స్వామి అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆ కేసును విచారించింది. భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనేది భాగమైందే అని సుప్రీంకోర్టు తెలిపింది.
రాజ్యాంగ పీఠికలో ఉన్న సోషలిస్టు, సెక్యులర్ పదాలను పాశ్చాత్య దేశాల కోణంలో చూడాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొన్నది. 42వ సవరణ ద్వారా ఆ రెండు పదాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే భారతీయ కోణంలో ఆ పదాలకు అర్ధాలు భిన్నంగా ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది.
సామ్యవాదం అంటే అందరికీ అవకాశం ఇవ్వడమే అని, సమానత్వం అన్న భావన ఉంటుందని, దీన్ని పాశ్చాత్య కాన్సెప్ట్‌గా భావించవద్దు అని, భిన్నమైన అర్థాలు ఉంటాయని, అలాగే సెక్యులరిజం అన్న పదం కూడా భిన్నమైందని కోర్టు పేర్కొన్నది. ఈ కేసును మళ్లీ నవంబర్‌లో విచారించనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.