చండీగఢ్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో తాజాగా ఆంక్షలు విధించారు. నిరసనకారులు గుమిగూడకుండా 144 సెక్షన్ విధించారు. అలాగే మహేంద్రహర్, ఝజ్జర్ జిల్లాల్లో అన్ని ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. తదుపరి ఆదేశాల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఝజ్జర్ డిప్యూటీ కమిషనర్ కెప్టెన్ శక్తి సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సోమవారం దేశవ్యాప్తంగా బంద్ జరిగింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలతోపాటు హార్యానాలో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని యువకులు డిమాండ్ చేశారు.
మరోవైపు హర్యానాలోని ఫతేహాబాద్లో సోమవారం కొందరు యువకులు లాల్ బట్టి చౌక్‌ను దిగ్బంధించారు. మరికొందరు రోహ్తక్ జిల్లాలో రోడ్లపై నిరసన చేశారు. భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హర్యానాలోని అంబాలా, రేవారీ, సోనిపట్ సహా పలు రైల్వే స్టేషన్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.