కోల్కతా: సమాజంలో ఆరోగ్యకరమైన రాజకీయాల ఆనవాళ్లే లేకుండా పోయాయి. వేడుక ఏదైనా అవతలి పార్టీవాళ్లు, ఇవతలి పార్టీవాళ్లు కొట్టుకోవడం, తిట్టుకోవడం సాధారణం అయిపోయింది. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ వాతావరణం కొంత వేడెక్కడం సహజమే. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. ఎన్నికలతో సంబంధం లేదు. ఎప్పుడుపడితే అప్పుడు, సందర్భం ఏదైనా సరే రెండు పార్టీల వాళ్లు ఎదరుపడితే కొట్టుకోవడం అలవాటైపోయింది.
తాజాగా పశ్చిమబెంగాల్లో అలాంటి ఘటనే జరిగింది. మహనీయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతున్నారు. పశ్చిమబెంగాల్లోనూ ఎక్కడికక్కడ బోస్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భట్పారాలో జరిగిన జయంతి కార్యక్రమం పార్టీల మధ్య కుమ్ములాటకు దారితీసింది.
నేతాజీ జయంతి నేపథ్యంలో భట్పారాలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇంతలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది. కాసేపట్లోనే ఒకరినొకరు తోసుకుని రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గొడవ సద్దుమణిగేలా చేశారు.
#WATCH | Scuffle broke out between TMC and BJP supporters during an event on the 125th birth anniversary of Netaji #SubhasChandraBose, in Bhatpara, West Bengal. pic.twitter.com/kRr6dIJWtl
— ANI (@ANI) January 23, 2022