Project Cheetah | న్యూఢిల్లీ: భారత్లో ఆఫ్రికన్ చీతాలను ప్రవేశపెట్టడం ప్రణాళిక రహితంగా జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రాదేశిక జీవావరణాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా చీతాలను కునో జాతీయ పార్కులోకి వదిలి పెట్టడం వల్ల పొరుగున ఉన్న గ్రామస్థులతో వాటికి ఘర్షణ ఏర్పడవచ్చని హెచ్చరించారు. వివిధ రకాల జంతువుల్లో వ్యక్తిగతంగా ఒక్కో జంతువు స్వేచ్ఛగా సంచరించాల్సిన పరిధిని ప్రాదేశిక జీవావరణం నిర్దేశిస్తుందని తెలిపారు. నమీబియాలోని లెబినిజ్-ఐజేడబ్ల్యూ చీతాల పరిశోధన ప్రాజెక్ట్ శాస్త్రవేత్తల ప్రకారం దక్షిణాఫ్రికాలో చీతాలు నివసించే ప్రాదేశిక జీవావరణం విశాలంగా ఉంటుంది.
ఒక్కో జంతువు సంచారానికి 100 చదరపు కిలోమీటర్ల పరిధి ఉంటుంది. కన్సర్వేషన్ సైన్స్ అండ్ ప్రాక్టీస్ జర్నల్లో ప్రచురితమైన లేఖ ప్రకారం చీతాలు సంచరించడానికి కునో పార్కు చాలా చిన్నదని, చీతాలు పార్కు హద్దులు దాటి పొరుగున ఉన్న గ్రామాల్లోకి చొరబడే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కునో పార్కులోని వేటాడే స్థల పరిధి ప్రకారం అందులో 21 పెద్ద వయస్సు చీతాలు సంచరించవచ్చని భారత అధికారులు భావించారని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఈ అంచనా సరైనది కాదని తెలిపారు.
భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో ఆదివారం అనారోగ్యంతో మరో చీతా మరణించింది. ఆరేండ్ల వయస్సు ఉన్న ఈ మగ చీతా పేరు ఉదయ్. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తెచ్చిన 12 చీతాల్లో ఇది ఒకటి. గత ఏడాది నమీబియా నుంచి తెచ్చిన ఎనిమిది చీతాల్లో ఒకటైన సాశా అనే ఆడ చీతా మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు మరో చీతా మృతి చెందడంలో మొత్తం చీతాల సంఖ్య 20 నుంచి 18కి తగ్గింది.