న్యూఢిల్లీ: శస్త్ర చికిత్సకు ముందు రొటీన్‌గా చేసే రక్త పరీక్ష కొత్త బ్లడ్ గ్రూప్‌ను వెలుగులోకి తీసుకొచ్చింది. 15 ఏళ్ల తర్వాత దీనికి ‘గ్వాండా నెగెటివ్’ అని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది 48వ బ్లడ్ గ్రూప్ సిస్టమ్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సైన్స్‌లో విస్తృత చర్చకు ఈ పరిశోధన అవకాశం కల్పించింది. ఫ్రెంచ్ కరీబియన్ దీవి గ్వాడెలూప్లో జన్మించిన మహిళ పారిస్‌లో ఉంటున్నారు. ఆమెకు 54 ఏళ్ల వయసులో 2011లో శస్త్ర చికిత్సకు ముందు రొటీన్‌గా రక్త పరీక్ష చేశారు.
ఈ నమూనా సరికొత్తగా కనిపించింది. తెలిసిన బ్లడ్ గ్రూప్‌లతో మ్యాచ్ కాకపోవడం మాత్రమే కాకుండా, తెలిసిన ప్యాటర్న్‌లో ఇమడని యాంటీబాడీ కూడా దీనిలో ఉంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు తగిన సాధనాలు అప్పట్లో లేవు. అందువల్ల ఆ రక్త నమూనాను భద్రపరిచారు. ఆ తర్వాత ఎనిమిదేళ్లపాటు ఈ మిస్టరీ అపరిష్కృతంగానే మిగిలిపోయింది.
డీఎన్ఏ సీక్వెన్సింగ్ అభివృద్ధి చెందిన తర్వాత శాస్త్రవేత్తలు 2019లో ఈ రక్త నమూనాను పరిశీలించారు. పూర్తిగా జన్యుపరమైన కొత్త మార్పును గుర్తించారు. అంతర్జాతీయ బ్లడ్ గ్రూప్ డాటాబేస్‌లో మునుపెన్నడూ ఇటువంటి రక్తాన్ని గుర్తించలేదు. ఈ మహిళకు ఆమె తల్లి, తండ్రి నుంచి ఇది సంక్రమించింది. ఈ అరుదైన జన్యువు వారిద్దరి నుంచి ఆమెకు వచ్చింది.
రెండు విధాల వారసత్వం ఆమెకు ఈ ప్రత్యేకమైన బ్లడ్ టైప్‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలోని రక్తదాతల్లో ఈ బ్లడ్ గ్రూప్ ఎవరికీ లేదు. ఈ భూమిపై ఇప్పటి వరకు తన రక్తాన్ని తానే సురక్షితంగా తీసుకోగలిగిన ఏకైక వ్యక్తి ఆమె కావడం విశేషం. గుర్తుపట్టలేని లేదా అరుదైన రక్తం గల వ్యక్తులకు శస్త్ర చికిత్స అవసరమైతే, వారికి ఎక్కించే రక్తం సరైన గ్రూప్‌నకు చెందినది కాకపోతే, వారికి ప్రాణాపాయం కలుగుతుంది.