న్యూఢిల్లీ: రక్తపోటును(బీపీని) కొన్ని వారాల్లోనే 15 పాయింట్లు తగ్గించే కొత్త మందును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ ఔషధానికి లోరన్డ్రోస్టాట్ అని పేరు పెట్టారు. ఈ ఔషధం నియంత్రణ లేని లేదా చికిత్స తీసుకుంటున్న అధిక రక్తపోటును తగ్గిస్తుందని వారు తెలిపారు. అమెరికా వ్యాప్తంగా రోగులతో కలిపి 285 మందిపై ఈ ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.
ఇందులో ప్లాసిబో తీసుకున్న వారిలో తగ్గిన 7 బీపీ పాయింట్లతో పోలిస్తే లోరన్డ్రోస్టాట్ తీసుకున్న వారిలో సిస్టోలిక్ రక్తపోటు 15 పాయింట్లు తగ్గింది. ఆమోదించదగిన సైడ్ ఎఫెక్టులతో లోరన్డ్రోస్టాట్ సమర్థంగా పని చేస్తున్నదని అధ్యయన ముఖ్య రచయిత, కార్డియాలజిస్ట్ క్లీవ్లాండ్ పేర్కొన్నారు. ఇతర మందులను వాడినప్పుడు వచ్చే దుష్ప్రభావాలతో పోలిస్తే లోరన్డ్రో స్థిరంగా పని చేస్తున్నదని తెలిపారు.