kisan kavach | న్యూఢిల్లీ : సేద్యంలో పురుగుమందుల వాడకం తప్పనిసరి. వీటి ప్రభావానికి గురికాకుండా రైతుల రక్షణ కోసం ప్రత్యేకమైన బాడీసూట్(దుస్తులు) ‘కిసాన్ కవచ్’ మార్కెట్లోకి రాబోతున్నాయి. పురుగుమందు నిరోధక బాడీసూట్(కిసాన్ కవచ్)ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. కిసాన్ కవచ్ మొదటి బ్యాచ్ దుస్తుల్ని ఆయన కొంతమంది రైతులకు పంపిణీ చేశారు. పురుగుమందుల వాడకంలో హానికారక రసాయనాల ప్రభావానికి గురికాకుండా ‘కిసాన్ కవచ్’ దుస్తులు రక్షణ కల్పిస్తాయి.
తద్వారా రైతుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దుస్తులు కాపాడుతాయి. బెంగళూరుకు చెందిన ‘బ్రిక్-ఇన్‌స్టెమ్’, సిపియో హెల్త్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా తయారుచేసిన ‘కిసాన్ కవచ్’ దుస్తుల ధర రూ.4,000. వీటిని ఉతికి, కనీసం 150 మార్లు వినియోగించవచ్చునని సంస్థ తెలిపింది. ‘ఉతికి, తిరిగి వాడగలిగే ఈ సూట్‌ను కనీసం ఏడాది ఉపయోగించవచ్చు. అత్యంత అధునాతన ఫ్యాబ్రిక్ టెక్నాలజీ పురుగుమందుల ప్రభావాన్ని డీయాక్టివేట్ చేస్తుంది’ అని జితేంద్ర సింగ్ చెప్పారు.